Saturday, February 13, 2010

వడ్డాది పాపయ్య, Vaddadi Papayya






















భారతదేశానికి గర్వకారణమైన చిత్రకారుడు వడ్డాది పాపయ్య. ప్రాచీన సాహిత్యాన్ని అకళింపు చేసుకొని తన కుంచెకు సాహితీ సౌరభాన్ని పులిమి చిత్రాలను చిత్రించిన ప్రత్యేక చిత్రకారుడు శ్రీవడ్డాది పాపయ్య.

పవిత్ర నాగావళీ నదీ తీరాన శ్రీకాకుళం పట్టణంలో రామమూర్తి, మహలక్ష్మి దంపతులకు సెప్టెంబరు 10, 1921 ప్రముఖ చిత్రకారుడు వడ్డాది పాపయ్య జన్మించారు. తండ్రి చిత్రకళా ఉపాధ్యాయుడు కావడంతో ఓనమాలు తండ్రి వద్దనే నేర్చి ఐదు సంవత్సరాల పిన్న వయసులోనే తన ఇంటిలో ఉన్న రవివర్మ చిత్రం "కోదండ రామ" ను ప్రేరణగా తీసుకుని హనుమంతుని చిత్రాన్ని గీసారు. పాపయ్య చిన్న తనంలో తండ్రి భారత, భాగవతాలను వినిపిస్తుండేవారు. ఆ ప్రభావం వలన పాపయ్యగారు ఆధునికత కంటే ప్రాచీనత మీద, ముఖ్యంగా భారతీయ శిల్ప,చిత్ర కళల మీద మక్కువ పెంచుకొన్నారు.





పత్రికా రంగంలో--

చిత్రకళ నేర్చుకొంటున్న తొలినాళ్ళలో దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు వీరి చిత్రాలు పత్రికలలో ప్రచురించి ప్రోత్సహించారు. ఆ తరువాత వీరు రేరాణి, మంజూష, అభిసారిక, ఆంధ్రపత్రిక, భారతి, ఆంధ్రజ్యోతి తదితర పత్రికలలో చిత్రాలు గీయటం ప్రారంబించారు.

కొంతకాలం తరువాత చందమామ సంపాదకులు చక్రపాణి పరిచయంతో దాదాపు అర్ధ శతాబ్ధం పాటు చందమామను తన కుంచెతో తీర్చి దిద్దారు. అప్పటిలో చందమామ ఎనిమిది భాషలలో వెలువడుతుండటంతో పాపయ్య చిత్రాలు దేశవ్యాప్తంగా ప్రచారం పొందాయి. యువ మాసపత్రిక లో చిత్రకారులు ఒక చిత్రం గీసే అవకాశం అరుదుగా వచ్చే రోజులలో నెలకు నాలుగు ఐదు చిత్రాలు గీసేవారు పాపయ్య. చందమామ, యువ ,తర్వాత స్వాతి వార, మాస పత్రికలలో దశాబ్ధకాలం పైగా ఈయన చిత్రాలు నడిచాయి.

వడ్డాది పాపయ్యగారు గీసిన చిత్రాల క్రింద 'వ.పా.' అనే పొడి అక్షారాల సంతకం వారి ప్రత్యేకత. వీరి బొమ్మలకు గల మరొక కుంచె గుర్తు '0|0' అని వుండడం. ఇందు గురించి ఆయన చెప్పిన భాష్యం - "గతం శూన్యం, వర్తమానం శూన్యం, భవిష్యత్తులో నిలుచున్నానని".

వ.పా. కేవలం చిత్రకారుడే కాదు. రచయిత కూడా. చందమామలో కొడవటిగంటి కుటుంబరావు మొదలు పెట్టిన 'దేవీభాగవతం' కథలను పూర్తి చేసింది ఆయనే. 'విష్ణుకథ' పౌరాణిక సీరియల్ కూడా ఆయన వ్రాసిందే.



స్వవిశేషాలు--
* 1947 లో నూకరాజమ్మను, 1984 లో లక్ష్మి మంగమ్మను వివాహమాడారు. అయనకు ముగ్గురు కుమారులు మరియు ఒక కుమార్తె. కూతురు అనూరాధ మీద మమకారంతో కశింకోటలో 'పావన కుటీరం' నిర్మించుకొని స్థిరనివాసులయ్యారు.
* సాధారణంగా చిత్రకారులు మోడల్స్ యొక్క నమూనాలనో లేదా వారినే చూస్తూనో చిత్రాలు గీస్తుంటారు. కాని పాపయ్యగారు మాత్రం ఏనాడూ ఆవైపు పోలేదు. తన ఆలోచనల రూపాలనే చిత్రాలుగా చిత్రించేవారు.
* పాపయ్యగారి చిత్రాలలో తెలుగు సంస్కృతి, తెలుగుదనం, ఆచార వ్యవహారాలు, అలంకరణలు, పండుగలు ప్రధాన చిత్ర వస్తువుగా ఉంటాయి.
* లోకానికి తెలియకుండా తనను తాను ఏకాంతంలో బంధించుకొని మరెవరూ దర్శించలేని దివ్య దేవతారూపాలను చిత్రించే పాపయ్యగారు 1992 - డిసెంబర్ 30 న దివ్యలోకాలకు పయనమై వెళ్ళిపోయారు.


  • ===============================================
visit my website -> dr.seshagirirao

3 comments:

  1. Vaddadi Papaiah was an artist of a high order. HIs work is,and would be, a source of inspiration for a great many.

    ReplyDelete
  2. India has some eminent personalities in the field of art.I feel that sri.Vaddadi.Papayya Sastry garu stands in the front row among them.His popular paintings makes our hearts filled with love, motivation and inspiration towards the art.

    ReplyDelete
  3. We have grown up seeing this great artist marvellous works. Someone should take interest to set up ART EXHIBITION of Sri Vaddadi Paapayya garu

    ReplyDelete