Thursday, April 29, 2010

కనకమహలక్ష్మి(సంగీత కళాకారిణి) ,Kanakamahalakshmi(Music Artist)





కనకమహలక్ష్మి పుట్టినిల్లు, ఇటు మెట్టినిల్లు కుటుంబమంతా సంగీత కళాకారులే కావడం విశేషం. అదే ఒరవడిలో భార్యాభర్తలు, పిల్లలు కూడా సంగీత వాద్యకళాకారులుగా రాణిస్తుండటం

స్ఫూర్తిదాయకం. పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న దూసి గ్రామంలో దూసి కనక మహలక్ష్మి, భర్త రమేష్‌, కుమారుడు తారకరామలు వాద్య సంగీతంలో రాణిస్తున్నారు.

రసవనముల దూసిలో స్వరసుమాలు కోసి సప్త స్వరాలుగా పేర్చిన ఆ సంగీత కుటుంబం అందరికీ స్ఫూర్తిదాయకం.

దూసి కనకమహలక్ష్మి విజయనగరం మహారాజ సంగీత నృత్య కళాశాలలో భరతనాట్యం, నాలుగేళ్ల వీణావాయిద్యం కోర్సులో ధ్రువపత్రం, గాత్ర సంగీతంలో డిప్లొమో అందుకుని ప్రదర్శనలిస్తున్నారు. ఈమె తండ్రి వైణిక విద్వాంసులు దివంగత కవిరాయుని జోగారావు సంగీత కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు. ఈమె అక్కా చెల్లెలు సంగీతంలోను, తమ్ముడు శాస్త్రి వీణ అధ్యాపకునిగా పనిచేస్తున్నారు. కాకినాడ, విశాఖపట్టణాల్లో ప్రదర్శనలిచ్చిన కనకమహలక్ష్మి మూడేళ్లు కళాపరిచయం శిక్షణ ఇచ్చారు. తిరుపతి బ్రహ్మోత్సవాలు, సునాదవినోదిని,

ధర్మప్రచార పరిషత్తు ఆధ్వర్యంలో ఎన్నో ప్రదర్శనలిచ్చారామె. విభిన్న ప్రక్రియల్లో వైవిద్యం ఉన్న ఆమె ఆకాశవాణి 'బి' గ్రేడు కళాకారిణి. అప్పట్లో జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి ప్రదర్శనలిచ్చారు. ప్రభుత్వం స్థలం ఇస్తే సంగీత పాఠశాల ఏర్పాటుచేసి ఔత్సాహికులకు శిక్షణ ఇవ్వాలని కోరిక ఉందని ఆమె చెప్పారు.

కనకమహలక్ష్మి భర్త దూసి రమేష్‌. దూసిలోనే పంతులు సత్యానారాయణ వద్ద సంగీతం నేర్చుకుని విజయనగరం సంగీత కళాశాలలో వయోలిన్‌ వాదనలో సర్టిఫికెట్‌ కోర్సు చేశారు. తొలుత డి.ఎ.వి.పబ్లిక్‌ స్కూలులో సంగీతం ఉపాధ్యాయునిగా, ప్రస్తుతం వెన్నెలవలస నవదోయ విద్యాలయంలో సంగీతం ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. హార్మోనియం, కేషియో, వయోలిన్‌లతో హరికథా కళాకారులకు గాత్ర సంగీత కళాకారులకు పక్క వాద్య కళాకారునిగా సహకారం అందిస్తున్నారు.

రమేష్‌ తల్లి పాపాయమ్మ మంచి వైణిక విద్వాంసురాలు. వీరి కుమార్తె లక్ష్మీ, మాణిక్య, సౌమ్య, గాత్ర సంగీతంలోను, కుమారుడు డి.ఎస్‌.వి.ఎన్‌. తారకరామ మృందంగం విద్యను నేర్చుకుంటూ ప్రదర్శనలిస్తున్నారు. తారకరామ సునాద వినోదిని ఎం.కె.ఆర్‌.ప్రసాద్‌ వద్ద మృదంగం నేర్చుకున్నారు. ఇంటర్మీడియట్‌ చదివిన తారకరామ ఇటీవల విశాఖలో సంగీత కళాసమితి పోటీల్లో మొదటి బహుమతి పొందారు.

  • =========================================
Visit my website -> Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment