Monday, April 12, 2010

పైల వాసుదేవరావు , Paila Vaasudevarao




శ్రీకాకుళం జిల్లాలో గిరిజన సాయుధ పోరాటాన్ని ప్రారంభించి, పెత్తాందారీ వ్యవస్థపై తుపాకీని ఎక్కుపెట్టి, గిరిజనోధ్దరణకు నడుంబిగించిన ఉద్యమ నాయకుడు పైలా వాసుదేవరావు ఆదివారం మరణించినట్లు తెలుసుకున్న జిల్లా ప్రజలు నిట్టూర్పు విడిచారు. జిల్లాలో నక్సలైట్ల ఉద్యమాన్ని ప్రారంభించిన ముఖ్యనాయకులైన ఆదిబట్ల కైలాసం, వెంపటాపు సత్యం వంటి నాయకులు పోలీసుల చేతుల్లో మరణించిన తరువాత ఉద్యమం ఏవిధంగా ముందుకు వెళుతుందని డీలాపడిన నక్సలైట్ల ఉద్యమానికి నాయకత్వం వహించి, జిల్లాలో భూస్వాములపై ఉధృతమైన పోరాటాలు సాగించి, గిరిజన హక్కుల పరిరక్షణకు ఎంతగానో కృషిచేసిన పైలా వాసుదేవరావు తన జీవితకాలంలో సగానికిపైగా అజ్ఞాతంలోనే గడిపారు. అజ్ఞాతంలోనే ఆఖరివరకూ గడిపి తుదిశ్వాశ విడిచారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన చేసిన పోరాటాలు నిరుపమానం. పెత్తందారీ వ్యవస్థపై ఆయన ఉద్యమాలు ప్రభుత్వాలను గడగడలాడించాయి. గిరిజన ప్రజలను ఆకర్షింపచేశాయి. ఆయన చేసిన ఉద్యమాలు శ్రీకాకుళం జిల్లానుంచి హైదరాబాద్‌ వరకూ ప్రభుత్వాలను, పోలీసులను నిద్దురలేకుండా చేశాయి. శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల గ్రామంలో పుట్టిన ఆయన హైదరాబాద్‌లోనే ఆదివారం తుదిశ్వాశ విడిచారు. వివాహం చేసుకున్నప్పటికీ, ఒక పాప పుట్టిన తరువాత ఉద్యమానికి ఎక్కడ కడుపు తీపి, మమకారం అడ్డుతగులుతాయోనని భావించిన పైలా పుట్టిన పాపను బంధువులకు అప్పచెప్పి ఉద్యమారణ్యంలోకి వెళ్లిపోయారు.

పైలా ఉద్యమ జీవితం సాగిందిలా...

పైలా వాసుదేవరావు 1932 సంవత్సరం ఆగస్టు 10వ తేదీన బాణాపురం అనే గ్రామంలో జన్మించారు. అతని తల్లిదండ్రులు అమ్మాయమ్మ, అప్పోజినాయుడు. వజ్రపుకొత్తూరు మండలం రిట్టపాడు గ్రామంలో పెరిగి ఎస్‌ఎస్‌ఎల్‌సి వరకు కాశీబుగ్గలో చదువుకున్నారు. ఆయనకు 20 సంవత్సరాల వయస్సునాటికే కమ్యూనిస్టు ఉద్యమాలు, భావాల పట్ల ఆకర్షితులై 1952లో కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకుని అప్పటి కమ్యూనిస్టు ఉద్యమ నాయకులైన డిబికె చౌదరి మరికొందరితో కలసి కమ్యూనిస్టు పార్టీలో చురుకుగా పాల్గొన్నారు. 1964వ సంవత్సరంలో టెక్కలి తాలూకా వ్యవసాయ కార్మిక సంఘానికి కార్యదర్శిగాను, జిల్లా సంఘానికి సహాయ కార్యదర్శిగాను ఎన్నికయ్యారు. మొదట సర్వే డిపార్టుమెంట్‌లో పనిచేసి ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి 1961వ సంవత్సరంలో ఉపాధ్యాయునిగా సోంపేట తాలుకా జీడిపుట్టుగలో పనిచేశారు. అక్కడనుంచే శ్రీకాకుళం గిరిజన సాయుధ రైతాంగ పోరాటం ప్రారంభించారు. 1968 నవంబరు 25వ తేదీన పైలా అజ్ఞాత జీవనంలోకి వెళ్లి ప్రజా పోరాటాలు కొనసాగించారు. 1970లో వజ్రపుకొత్తూరు మండలం రాజాం గ్రామానికి చెందిన చెల్లూరి చంద్రమ్మను మందస ఏజెన్సీలో వివాహం చేసుకున్నారు. 1971లో వారికి ఒక పాప జన్మించింది. ఆ పాపను ఇతరులకు పెంచుకోవడానికి ఇచ్చారు. పూర్తిస్థాయిలో ఉద్యమాలకే ఆయన జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు. పంచాది కృష్ణమూర్తి, సుబ్బారావుపాణిగ్రహి, వెంకటాపుసత్యం, ఆదిభట్ల కైలాసం అప్పట్లో నక్సలైట్ల ఉద్యమాన్ని ఉధృతంగా నిర్వహిస్తూ ఉండేవారు. అయితే వీరు వరుస ఎన్‌కౌంటర్లలో చనిపోయిన తరువాత పైల వాసుదేవరావు నక్సలైట్ల ఉద్యమానికి నాయకత్వం వహించిచెల్లా చెదురైన ఉద్యమాన్ని ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దుల్లో సంఘటితం చేసి ఉద్యమాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్లారు.

పైలా కె.జి.సత్యమూర్తి, కొండపల్లి సీతారామయ్య, రావుఫ్‌లతో కలసి రాష్ట్ర కమిటీ ఏర్పాటు కాగా దాంట్లో పైలా రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. పైలా వాసుదేవరావుపై శ్రీకాకుళం జిల్లా నలుమూలలా 40కి పైగా పోలీసు కేసులు ఉన్నాయి. సోంపేట తాలుకా బొరివంకలో జంట హత్యల కేసులోనూ, వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం సంఘటనలోను పైలా ముద్దాయి. అలాగే మజ్జి తులసీదాస్‌పై పలుమార్లు దాడికి ప్రయత్నించారు. కిల్లోయి బంజరు సార అప్పన్న హత్య కేసులో కూడా పైల ముద్దాయి. మెళియాపుట్టి మండలంలో ఏర్పడిన చందనగిరి దళానికి 1969నుండి 1972 వరకు పైల వాసుదేవరావు నాయకత్వం వహించారు. ఈయన నాయకత్వంలోనే డేగల పోలూరులో భూస్వామి జయచంద్రపాణిగ్రహి అలియాస్‌ గాలిబాబును తల నరికి అతని ఇంటికే వేలాడదీశారు. ఈ సంఘటన అప్పట్లో రాష్ట్రంలో సంచలనం కలిగించింది. భూస్వాముల గుండెల్లో ఆందోళన కలిగించింది. 1975లో మందస మండలం రామరాయి కొండల్లో పైల వాసుదేవరావు, చంద్రక్క, కుమార్‌తోపాటు మరికొందరు రాష్ట్ర స్ధాయి సమావేశం జరుపుతుండగా పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో కుమార్‌ చేయికి బుల్లెట్లు తగిలి చేయిపోగా చంద్రమ్మ పోలీసులకు చిక్కారు. పైల వాసు మాత్రం తప్పించుకున్నారు. ఆనాటినుంచి నేటివరకు ఆయన జీవితం అజ్ఞాతంలోనే సాగింది. గత కొంతకాలంగా ఆరోగ్యం సరిగా లేక ఉద్యమాలకు దూరంగా ఉంటూ రహస్యంగా వైద్య సేవలు పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు. అతనిపై పోలీసు కేసులు ఎన్ని ఉన్నప్పటికీ శ్రీకాకుళం జిల్లా ప్రజల హృదయాల్లో పైల వాసుదేవరావు గుర్తుండిపోయారు.

వాసుదేవరావు 11-ఏప్రిల్ 2010 తేదీన స్వర్గస్తులైనారు . ఆయన జ్ఞావకార్థం. స్వగ్రామం(పెరిగిన గ్రామము) రిట్టపాడులో స్థూపం ఏర్పాటు చేస్తున్నారు. వ్రథమ వర్థరతి సభ 11-04-2011 న విశాఖవట్నం పౌర గ్రంథాలయంలో నిర్వహిస్తున్నట్లు న్యూడెమక్రసీ జిల్లా నాయకురాలు, పాసుదేవరావు భార్య పైల చంద్రమ్మ తెలిపారు.


మూలము : ఆంధ్రప్రభ దినపత్రిక 12/ఏప్రిల్ /2010
  • ===================================================
Visit my website -> Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment