Monday, May 3, 2010

కాంతారావు.ఎస్ , Kantharao.S




జిల్లాకు చెందిన ఎస్‌.కాంతారావు జులై 27 నుంచి ఆగస్టు 27వ తేదీ వరకు స్వీడన్‌లో జరుగనున్న 13వ ఫీనా వరల్డ్‌ మాస్టర్స్‌ స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఎచ్చెర్లలో ఎ.ఆర్‌.కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఎస్‌.కాంతారావు పోలాకి మండలం వనిత మండలం గ్రామానికి చెందినవాడు. సాధారణ రైతు కుటుంబానికి చెందిన కాంతారావు చిన్ననాటి నుంచి ఈతపై మక్కువ పెంచుకున్నాడు. తమ గ్రామం సమీపాన గల వంశధార నదిలో రోజూ స్నానానికి వెళ్తూ ఈత నేర్చుకున్నాడు. 1990లో విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి గ్రామీణ ఈత పోటీల్లో తొలిసారిగా పాల్గొని 50 మీటర్లు, 100 మీటర్లు ఫ్రీ స్త్టెయిల్‌ విభాగంలో స్వర్ణ, రజత పతకాలను కైవసం చేసుకున్నాడు. అప్పటినుంచి రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని పలు పతకాలు కైవసం చేసుకున్న కాంతారావు 1996లో క్రీడల కోటాలో ఎ.ఆర్‌. కానిస్టేబుల్‌గా ఉద్యోగం పొందాడు. కాంతారావు ప్రస్తుతం ఓ పక్క ఉద్యోగ విధులు నిర్వహిస్తూనే క్రమం తప్పక ఈత సాధన చేస్తూ పలువురికి శిక్షణ ఇస్తున్నాడు. ఇతని శిక్షణలో పలువురు జాతీయస్థాయి ఈత పోటీల్లో రాణిస్తూ వస్తున్నారు.

సాధించిన పతకాలు
* 2000లో విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో వివిధ అంశాల్లో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు కైవసం
* 2002లో కర్నూల్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో వివిధ అంశాల్లో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు కైవసం.
* 2003లో గుంటూరులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో నాలుగు స్వర్ణపతకాలు కైవసం.
* 2004లో వరంగల్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో నాలుగు స్వర్ణ, రెండు రజత, ఒక కాంస్య పతకం కైవసం.
* 2009లో నెల్లూరులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో మూడు స్వర్ణ, రెండు రజత పతకాలు కైవసం.
* ఈ ఏడాది మార్చిలో గుజరాత్‌లో జరిగిన ఆలిండియా మాస్టర్స్‌ స్విమ్మింగ్‌ పోటీల్లో స్వర్ణ పతకం కైవసం చేసుకుని స్వీడన్‌లో జరుగనున్న 13వ ఫీనా వరల్డ్‌ మాస్టర్స్‌ స్విమ్మింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీలకు ఎంపికయ్యాడు.

పోలీస్‌ క్రీడల పోటీల్లో
* 2007లో కర్నూలులో జరిగిన రాష్ట్రస్థాయి పోలీసుల ఈత పోటీల్లో నాలుగు స్వర్ణ, రెండు రజత పతకాలు కైవసం.
* 2008లో కాకినాడలో జరిగిన రాష్ట్రస్థాయి పోలీసుల ఈత పోటీల్లో ఆరు స్వర్ణ, ఒక రజత పతకం కైవసం
* 2001లో 2002 ఢిల్లీ, 2003 మహారాష్ట్ర, 2004లో ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి పోలీసు ఈత పోటీలకు ప్రాతినిధ్యం వహించాడు.
స్వీడన్‌లో జరగనున్న ప్రపంచ మాస్టర్స్‌ స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొని పతకం సాధించటమే ఆశయమని కాంతారావు పేర్కొన్నాడు. అలాగే ఆసక్తి గల అందరికీ ఈతలో శిక్షణ ఇస్తూ జాతీయస్థాయిలో ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనేది ఆశయమని తెలిపాడు.


  • ==========================================
Visit my website -> Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment