Monday, January 31, 2011

చిన్నా(ధర్మారావు),Chinna (Dharmarao)


కలలు రెండు రకాలు. నిద్ర పోయినప్పుడు వచ్చి మెలకువతో కరిగిపోయేవి మొదటివి. నిద్ర పట్టనివ్వకుండా చేసేవి రెండో రకం. నిద్రలో కనే కలలతో ఇబ్బందేం లేదు. లేవగానే వాటిని మర్చిపోతాం. ఈ రెండో రకంతోనే సమస్య అంతా. అవి మనిషిని ఒకచోట నిలవనివ్వవు. కళ్లు మూసుకోనివ్వవు, ఇరవైనాలుగ్గంటలూ త్వరపెడతాయి, ముందుకు పదమని వెంటపడతాయి.

'నేను వందమందికి అన్నం పెట్టే స్థాయికి ఎదగాలి' అని అతి మామూలు ఐటీఐ డిప్లమో కుర్రాడు కన్న కల ఎలా నిజమయింది? ఎలాగంటే - సినిమాల్లో ఆర్ట్ డైరెక్షన్ వయా సిరామిక్ కంపెనీ ఉద్యోగం వయా ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ వయా మెళియాపుట్టిలో పుట్టిన పంతం. ఈ ప్రయాణంలో ఎగుడుదిగుళ్లన్నీ తెలియాలంటే విశాఖపట్నం శివార్లలో వివాదాస్పదమైన సినిమా సెట్ దగ్గరకు వెళ్లాలి. ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను పలకరించాలి.

'మీ శ్రీకాకుళం జిల్లా మనిషే' అని మీడియా మిత్రులు హాస్యంగా పరిచయం చేస్తుంటే చిన్నా తలదించుకుని సిగ్గుగా నవ్వారు. ఒకవైపు జోరుగా సాగుతున్న సెట్ నిర్మాణం. బల్లలు కొడుతున్నవారు కొందరు, చెక్కను చిత్రిక పడుతున్నవారు కొందరు, రంగులు వేస్తున్నవారు కొందరు, నాటిన రకరకాల పూలమొక్కలకు నీళ్లు పోస్తున్నవారు కొందరు - వెరసి హడావుడిగా ఉంది వాతావరణం. అంతమంది మనుషుల మధ్య చిన్నాను ప్రత్యేకంగా పోల్చుకోవడం కష్టం. ఆయనేం నీడ పట్టున కుర్చీలో కూర్చోడు. చేతికీ, మెడలోనూ బంగారు గొలుసులు, కళ్లకు చలవ కళ్లద్దాలూ ఇవేమీ ఉండవు. పనివాళ్లతో కలిసిపోయి వాళ్లతో మాట్లాడుతూ అవసరమైతే తానే స్వయంగా పనిచేసి చూపిస్తూ ఉండే చిన్నా 'పోకిరి' 'నాగవల్లి' వంటి భారీ చిత్రాల కళాదర్శకుడంటే నమ్మడం కష్టమే.

అక్కడున్న రణగొణ ధ్వనుల మధ్య, చిన్నా గొంతూ వినిపించదు. అంత నెమ్మదైన, సౌమ్యమైన మాటతీరు ఆయనది. మెళియాపుట్టిలో పుట్టి పెరిగిన చిన్నా "నాకు మా ఊరంటే చాలా ఇష్టమండీ. అక్కడో గుడి కట్టాలని ప్రయత్నంలో ఉన్నాను. ఒక వృద్ధాశ్రమం నిర్మిస్తున్నా. నాకు ఇవాళ సంపాదన ఉందిగానీ రేపు ఎలా ఉంటుందో తెలియదు. నా పరిస్థితి ఎలా ఉన్నా సరే వృద్ధాశ్రమం ఇబ్బంది పడకూడదని దానికో శాశ్వతమైన ఆదాయ వనరును కల్పించే ప్రయత్నాల్లో ఉన్నా. అలాగే డబ్బులేక చదువు ఆగిపోయే విద్యార్థులను చూసినా చాలా బాధ కలుగుతుంది..'' అనే చిన్నా ఇప్పటికి ముగ్గురిని ఇంజినీరింగ్, మరొకరిని మెడిసిన్ చదివించారు. దానికీ ఓ కథ ఉంది. చదువు కోసం తాను పడిన కష్టమే దానికి భూమిక.

చిన్న ఉద్యోగం, పెద్ద సద్యోగం...
చిన్నప్పుడే తండ్రి పోతే నలుగురు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల మధ్య పెరిగిన చిన్నా తెలిసీతెలియని వయసు పంతంతో పదహారేళ్లకే ఇల్లు వదిలేశాడు. వైజాగ్‌లో ఐటీఐ చదువు తర్వాత నేరుగా తిరుపతి చేరుకుని ఒక సిరామిక్ టైల్స్ కంపెనీలో చిరుద్యోగిగా చేరాడు. నెలకు 390 రూపాయల జీతం. మెస్ ఖర్చులు పోను చేతికి వచ్చేది 165రూపాయలు. అదీ తొలినెల సంపాదన. తినీతినకా రోజులు గడిచేవి. అయితే ఆకలికి బదులు అతని కళ్లలో ఒక కల జీవం పోసుకుంది. 'ఎప్పటికయినా ఇలాంటి సంస్థను స్థాపించి దానికి ఎండీగా నేనుండాలి, వందమందికి అన్నం పెట్టాలి' అని.

ఐటీఐతో అలాంటి కలలు నెరవేరవని అతనికి స్పష్టంగా తెలుసు. దానికోసం బాగా చదువుకోవాలి. తిండి సంగతి తర్వాత చూసుకుందాం, ముందు చదువు పని పట్టాలనుకున్నాడు చిన్నా. సాయంత్రం కాలేజీలో చేరి ఏఎమ్ఐఈ డిగ్రీ పొందడానికి శ్రమించేవాడు. చేస్తున్న కొలువులో కుర్రాడు పెడుతున్న శ్రద్ధ, చదువుకోసం పడుతున్న అవస్థలూ సంస్థ యాజమాన్యం దృష్టికి వచ్చాయి. జీతం 750 రూపాయలైంది, మరో 750 ఇంటికి పంపించేవారు. ఏడున్నరేళ్లు గడిచాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పట్టా చేతికొచ్చింది. కదులుతూ ఉంటేనే చైతన్యం ఉన్నట్టు. కదిలేదానికే శక్తి ఉన్నట్టు. ఉన్న చోటును వదిలి ఎమ్ఆర్ఎఫ్ సంస్థలో చేరుదామని చెన్నై చేరాడు చిన్నా.

'తొలిప్రేమ'లో మునిగి 'పోకిరి'గా తేలి...
చెన్నై చిత్రసీమలో కళాదర్శకుడు బి.చలం అంటే పేరున్న మనిషే. చిన్నాకు వరుసకు తాతయ్యవుతారు. ఆయనకు చిన్నా కలిశారు. అక్కడ చలం కుమారుడు ఆనంద్‌సాయితో స్నేహం పెరిగింది. అతను కూడా కళాదర్శకత్వంలో రాణించాలని శ్రమిస్తున్న రోజులవి. పవన్ కళ్యాణ్ హీరోగా 'తొలిప్రేమ' మొదలైంది. ఆర్ట్ డైరెక్షన్ అవకాశం ఆనంద్‌సాయికే దక్కింది. 'ఇంకెందురా ఉద్యోగాలంటూ తిరుగుతావు? నాతో వచ్చెయ్. ఇద్దరం ఇందులోనే ఎదుగుదాం' అన్నారాయన. అక్కడ చిన్నా కథ మలుపు తిరిగింది. 'ఆనందం'తో మరో మెట్టెక్కింది.

ఎవరి పాపపుణ్యాలు వారివే
ఖుషీ, దేశముదురు, సూపర్, ఆంధ్రావాలా, చిరుత, యోగి, బుజ్జిగాడు, ఏక్‌నిరంజన్, హ్యాపీ, పోకిరి, కొంచెం ఇష్టం కొంచెం కష్టం.... చిన్నా కళాదర్శకుడిగా పనిచేసిన చిత్రాల జాబితా మొన్నమొన్నటి నాగవల్లిని కూడా కలుపుకొని ఇంకాఇంకా ముందుకెళుతోంది. "సిరామిక్ టైల్స్ ఫ్యాక్టరీ పెట్టాలన్న కల కరిగిపోయిందిగానీ నలుగురికీ ఉపాధి కల్పించాలన్న మూల సూత్రం అయితే నెరవేరింది. అలాగే అందమైన బాల్యాన్నిచ్చిన మా ఊరికి తోచిన సాయమూ చేయగలుగుతున్నాను.

అయితే ఒక టి, పది లక్షలు ఖర్చుపెట్టి గుడి స్లాబ్ వరకూ వేశాను. కానీ పల్లెటూరి వాతావరణం అనారోగ్యకరంగా మారిపోయింది. రాజకీయాలు, వ్యక్తిగత స్వార్థాలు గ్రామీణుల స్వచ్ఛతను హరించాయి. దానివల్లే వేగంగా అనుకున్నవన్నీ పూర్తిచేయలేకపోతున్నా'' అంటున్న చిన్నాను మధ్యలో ఆపి 'సినిమారంగంలో కూడా అబద్ధాలు, మోసాలు పనిచేయించుకున్నాక డబ్బులు ఎగ్గొట్టడాలు.. ఇవన్నీ ఉంటాయిగా' అంటే ఆయన చిన్నగా నవ్వుతాడంతే.

'ఎవరి పాపపుణ్యాలు వాళ్లవేనండీ' అనే చిన్నా షిరిడీ సాయిబాబా భక్తుడు. "ఇంట్లో ఏం ఇబ్బంది లేదండి. ఇదిగో వీళ్లకి సాయం చేశానంటే వాళ్లకు కూడా చెయ్యి - అనే భార్య, ఇద్దరు చక్కటి కొడుకులున్నారు. ఊళ్లో అనుకున్నవి అయిపోతే మరింకేం అక్కర్లేదు. బాబా ఆశీర్వాదంతో అయిపోతాయనుకోండి' అనే చిన్నా అసలు పేరు ధర్మారావు. అలాగని ఎవరికీ తెలియదు. పేరులో ధర్మం, మనసులో సంకల్పబలం రెండూ ఉన్న చిన్నా తలపెట్టిన మంచి పనులన్నీ పూర్తవుతాయి. ఎందుకు కావు?

--జూ అరుణ పప్పు, విశాఖపట్నం, ఫోటోలు : వై. రామకృష్ణ(Andhrajyothi news paper)


  • ====================================
Visit my website -> Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment