Wednesday, May 11, 2011

గజల్‌ శ్రీనివాస్ , Gazal Srinivas



శ్రీకాకుళం జిల్లాలో మా నాన్న పంచాయతీ అధికారిగా పనిచేశారు. టెక్కలిలో నేను పుట్టాను. ఈ జిల్లా నా జన్మభూమి. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ఖండాల్లో తిరిగినా శ్రీకాకుళం వచ్చేసరికి అమ్మ గర్భంలోంచి వచ్చినట్లుంటుంది. అటువంటి ఈ ప్రాంతంలో వేలాదిమంది ప్రేక్షకుల సమక్షంలో భారీ ప్రదర్శన ఇచ్చి శ్రీకాకుళాన్ని గిన్నీస్‌బుక్‌ రికార్డులో చూపిస్తాన'ని ప్రసిద్ధ గజల్‌ కళాకారుడు కేశిరాజు శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం శ్రీకాకుళం విచ్చేసిన గజల్‌ శ్రీనివాస్‌ శ్రీకాకుళంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. 'గాంధేయవాదం గతం కాదు... ప్రపంచానికి అదే భవిషత్తు' అని చాటి చెప్పడమే తన లక్ష్యమని శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ప్రపంచ భాషల్లో గాంధేయవాదం, సత్యాగ్రహ సిద్ధాంతాలు, శాంతగీతాలాపనలు చేయడం ద్వారా బాపూజీ పట్ల అవగాహన, తనకు ప్రజాదరణ లభిస్తుందని చెప్పారు. ఇటీవల కాలంలో 125 భాషల్లో పాడి రెండు ప్రపంచ గిన్నీసు రికార్డులు సాధించానన్నారు. ప్రపంచభాషల్లో శాంతి గీతాలు పాడడం వల్ల ఇరాన్‌, ఇరాక్‌ లాంటి దేశాల వారు ఇష్టపడి తనను పలుమార్లు ఆహ్వానిస్తున్నారని తెలిపారు. అంటార్కిటికా ఖండంలో తప్ప మిగతా ప్రపంచంలో మొత్తం 6 వేల కచేరీలు చేసినట్లు తెలిపారు.

అమెరికాలో తెలుగు తోరణం..
జులై 1, 2, 3 తేదీల్లో నాట్స్‌ ఉత్సవాల్లో (నార్త్‌ అమెరికా తెలుగు సంఘం) భాగంగా తెలుగు తోరణం కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు గజల్‌ శ్రీనివాస్‌ తెలిపారు. రసరాజు రాసిన తెలుగు తోరణం ప్రత్యేక గీతాన్ని గంటసేపు ప్రదర్శిస్తారన్నారు. గీతంలో అన్ని ప్రాంతాల తెలుగు ప్రజలు శిరసెత్తి గర్వపడేలా, సంస్కృతీ వైభవం ఉట్టిపడేలా ఆవిష్కరించారని తెలిపారు. రాష్ట్రంలో 400 నృత్య కళాకారులతో దక్షిణ అమెరికా న్యూజెర్సీ రాష్ట్రంలో ఈ ప్రదర్శన జరుగుతుందని తెలిపారు. తెలుగు తోరణం ద్వారా తెలుగుభాష, కళా సంస్కృతీ ప్రాభవాన్ని చాటిచెప్పడానికి తనకు ప్రదర్శనావకాశం లభించిందన్నారు.

త్వరలో 'నా బాల్యం నాకిచ్చేయ్‌' ఆల్బమ్‌..
గజల్‌ శ్రీనివాస్‌ ఛారిటబుల్‌ ట్రస్టు ద్వారా వచ్చే నెలలో హైదరాబాద్‌లో జరిగే ఓ కార్యక్రమంలో ఆడియో ఆల్బమ్‌ విడుదల చేయనున్నట్లు గజల్‌ శ్రీనివాస్‌ తెలిపారు. తాను స్వరపర్చి, గానం చేసిన 8 గజళ్ల ఆడియో ఆల్బమ్‌ 'నా బాల్యం నాకిచ్చేయ్‌' ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. తాను సుమారు 60 గజళ్లను రాశానని, సినారే, డాక్టర్‌ తాటపర్తి రాజగోపబాలం, రెంటాల వేంకటేశ్వరరావుల గజళ్లను గానం చేస్తుంటానని చెప్పారు. ఎవరైనా రచయితలు గజళ్లను రాస్తే పుస్తక ప్రచురణకు అయ్యే ఖర్చు తమ ట్రస్టు భరిస్తుందని తెలిపారు.

ఛారిటబుల్‌ ట్రస్టు ద్వారా వైద్యసేవలు..
తాను పుట్టిన శ్రీకాకుళం జిల్లాలో గజల్‌ శ్రీనివాస్‌ ఫౌండేషన్‌ ఛారిటబుల్‌ ట్రస్టు ద్వారా జిల్లాలో విస్తృతంగా వైద్యసేవలు, అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు ప్రసిద్ధ గజల్‌ గాయకుడు శ్రీనివాస్‌ వెల్లడించారు. ప్రపంచ ప్రసిద్ధ లాజరస్‌ ఆసుపత్రికి సాంస్కృతిక రాయబారిగా తాను ఉన్నందున ఇచ్ఛాపురం, కవిటి వంటి ప్రాంతాలను దత్తత తీసుకొని ప్రముఖ వైద్య నిపుణులతో సేవలందిస్తానని తెలిపారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌ వ్యాధి బారిన పడిన పలుగ్రామాలను దత్తత తీసుకొని వైద్యసేవలందిస్తున్న తెలిపారు. కళాకారులు, పారిశ్రామికవేత్తలు తాము పుట్టిన గ్రామాలనయినా దత్తత తీసుకొని సేవలందించాలని, 'ఓనామాలు నేర్పిన నీ వీధిబడి కూలిపోతూ నీకు సెలవు అడగమందీ..' 'ఆనవాలు పట్టలేని రాములోడి భజన గుడి' అని పాడి విన్పించారు.

అద్భుత సాహితీ ప్రక్రియ 'గజల్‌'
తెలుగు గజల్‌ అద్భుత సాహితీ ప్రక్రియ, సాహిత్యం అవగతం చేసుకొని సంగీతం మేళవించి కమనీయ రాగంతో పాడితే అది ప్రేక్షక రంజకమవుతుందని శ్రీనివాస్‌ తెలిపారు. కవి భావన అందంగా శ్రోతలకు ప్రేక్షకులకు చెప్పాలన్నారు. గజల్‌లో కవే గాయకుడు అన్నారు. తనను అనుకరించకుండా ఎవరైనా తనదైన బాణీలో ప్రేక్షకుల మనసు మీటేలా గానం చేయాలన్నారు. గతంలో రాష్ట్రస్థాయిలో గజల్‌ రచన, గానం ప్రక్రియల్లో సదస్సులు పెట్టామన్నారు. గజల్‌ని వృత్తిగా, ప్రదర్శనాత్మక కళగా తీర్చిదిద్ది ఎంతోమంది అభిమానులకు చేరువయ్యానన్నారు. గజల్‌ని ప్రేమించి మమేకమైనపుడే ముందుకు వెళ్తుందన్నారు. సినిమాలో హీరోగా నటించినా తనకు నచ్చలేదని, జీవితంలో హీరోగా ఉండాలని రోజుకు 19 గంటలు సాధన చేశానని చెప్పారు. అయిదారు వేల మంది జనం సమక్షంలో శ్రీకాకుళంలో అవకాశం కల్పిస్తే పాడుతానని శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఆయనతో పాటు వరం రెసిడెన్సీ అధినేత అంధవరపు వరం, తదితరులు పాల్గొన్నారు.

source : Eenadu news paper
  • =============================================
Visit my website -> Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment