Saturday, October 15, 2011

అరుణరాణి , Aruna Rani


  • Image : courtesy with Eenadu news paper.

కామన్వెల్త్‌ యూత్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో మూడు రజతాలు.
పాలకొండ క్రీడాకారిణి అరుణకిరణం - అరుణరాణి అంతర్జాతీయ ప్రతిభ- అర్బన్‌వెయిట్‌లిఫ్టింగ్‌లో శ్రీకాకుళం జిల్లా ఘన కీర్తి అప్రతిహంగా కొనసాగుతోంది.దక్షిణాఫ్రికాలో జరుగుతున్న కామన్వెల్త్‌ యూత్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో ఈ నెల 12న 63 కిలోల విభాగంలో మూడు రజత పతకాలు సాధించి దేశ ప్రతిష్ఠను అంతర్జాతీయంగా చాటింది. వెయిట్‌లిఫ్ట్‌ంగ్‌లో ఒలింపిక్‌ విజేత, జిల్లాకు చెందిన మల్లీశ్వరిని మరోసారి గుర్తుకుతెచ్చింది. మట్టిలో మాణిక్యాలు ఉంటాయన్న నానుడిని నిజం చేసింది.

సంగిడిరాళ్ల నుంచి..--పట్టణంలోని పెద్దకాపు వీధికి చెందిన గార అరుణరాణి.. తండ్రి తిరుపతిరావు సంగిడిరాళ్లు ఎత్తుతుంటే ఆసక్తిగా చూస్తూ.. ఆ రంగంపై ఆసక్తి పెంచుకుంది. కుమార్తె ఆసక్తిని గమనించిన తండ్రి ఆమెకు పదేళ్ల వయసులో వెయిట్‌లిఫ్టింగ్‌లో మెలకువలను నేర్పి తొలిగురువయ్యారు. 2002లో శిక్షకుడు అప్పన్న వద్దకు పంపారు. అనంతరం ప్రతిభ ఆధారంగా హైదరాబాద్‌లోని క్రీడా పాఠశాలలో సీటు లభించింది. అప్పటి నుంచి పలు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటూ అనేక పతకాలు కైవసం చేసుకుంది.

హైదరాబాద్‌లో ప్రస్తుతం డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అరుణ శిక్షకులు ఎస్‌.ఎ.సింగ్‌, మాణిక్యాలరావు శిక్షణలో రోజూ ఉదయం 6 నుంచి 9 వరకు, సాయంత్రం 4.30 నుంచి 7 గంటల వరకు వెయిట్‌లిఫ్ట్‌ంగ్‌లో తర్ఫీదు పొందుతోంది.

సాధించిన విజయాలు..
* 2007లో జోర్డాన్‌లో జరిగిన యూత్‌ జూనియర్‌ ఏషియన్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో బంగారు పతకం
* 2008లో పుణెలో జరిగిన యూత్‌ కామన్‌వెల్త్‌ పోటీల్లో వెండి పతకం
* 2009లో మలేసియాలో జరిగిన జూనియర్‌ కామన్‌వెల్త్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగంలో బంగారు పతకం
* 2010లో ఉజ్బెకిస్తాన్‌లో జరిగిన జూనియర్‌ ఏషియన్‌ పోటీల్లో తృతీయస్థానం
* బల్గేరియాలో జరిగిన జూనియర్‌ వరల్డ్‌ ఛాంపియన్‌ షిప్‌ విభాగంలో 11వ స్థానం
* మలేసియాలో జరిగిన జూనియర్‌ కామన్‌వెల్త్‌ ఛాంపియన్‌ షిప్‌ విభాగంలో వెండి పతకం

జాతీయ స్థాయిలో...
* 2004లో ముంబయిలో జరిగిన జూనియర్‌ యూత్‌ నేషనల్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో వెండి పతకం
* అదే ఏడాది జాతీయ పోటీల్లో రాగి పతకం
* 2005లో లక్నోలో జరిగిన జూనియర్‌ ఉమెన్‌ జాతీయ ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో పదో స్థానం
* 2007లో మణిపూర్‌లో జరిగిన జూనియర్‌ యూత్‌ జాతీయ పోటీల్లో బంగారు పతకం
* 2010లో రాజస్థాన్‌లో జరిగిన సీనియర్‌ జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగంలో రాగి పతకం
* 2011లో బెంగళూరులో జరిగిన సీనియర్‌ జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో బంగారు పతకం
* హర్యానాలో జరిగిన జాతీయ జూనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో బంగారు పతకం.
* జార్ఖండ్‌లో జరిగిన జాతీయ పోటీల్లో రాగిపతకం

ప్రపంచస్థాయిలో దేశానికి పేరు తెస్తా--రెండు నెలల క్రితం పాలకొండ వచ్చిన ఆరుణ 'న్యూస్‌టుడే'తో మాట్లాడుతూ.. వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగంలో అంతర్జాతీయంగా భారతదేశానికి మంచి పేరు తీసుకురావాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. ప్రతిభ కనబరుస్తున్నా రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించడంలేదని వాపోయారు.

ఆనందంగా ఉంది--తమ కుమార్తె అంతర్జాతీయస్థాయిలో పతకాలు సాధిస్తుండడం ఆనందంగా ఉందని తల్లి చిన్నమ్మడు, తండ్రి గార తిరుపతిరావు ఆనందం వ్యక్తం చేశారు. చిన్నతనం నుంచి అరుణపై పెట్టుకున్న నమ్మకం ఒమ్ము చేయలేదన్నారు. అరుణ సాధించిన విజయం పట్ల కుటుంబీకులు దుప్పాడ పాపినాయుడు, గణేష్‌, చిన్నంనాయుడు, రాములు, శంకరరావు హర్షం వ్యక్తం చేశారు.

అరుణరాణి తండ్రి గార తిరుపతిరావు ఇప్పటికీ సంతలకు వెళ్లి సరకులు విక్రయిస్తూ.. వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తున్నారు. కుమార్తెను క్రీడల్లో ప్రోత్సహిస్తున్నారు.

  • =============================
Visit my website -> Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment