Wednesday, February 1, 2012

శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొందరు సాహితీ యోధులు,Srikakulam some eminent Telugu Writers

భాష భావాన్ని వ్యక్తీకరిస్తుంది. మన నాగరికత, సంస్కృతిని ప్రేరేపిస్తుంది. ఇందులో ప్రధానమైనది సాహిత్యం. అనేక ప్రక్రియలు ఉద్యమాలు, విప్లవాలను రగిలించి జాతిని చైతన్యపరిచాయి. మాతృభాషకు జీవం పోసిన నాడే సమాజం జాగృతమవుతుంది. ఈ ప్రక్రియలతో ఎందరో కవులు, రచయితలు ఆయా ప్రాంతాల్లో ఉద్యమ ఉత్తేజాన్ని రగిలించారు. మన జిల్లానే తీసుకుంటే.. 'మాకొద్దీ తెల్లదొరతనం..' అంటూ ఆంగ్లేయులపై 'గరిమెళ్ల' కలం గర్జించింది. సిక్కోలు కథా 'యజ్ఞాన్ని' సాగిస్తున్న కారా మాష్టారు కథ కోసం ఓ నిలయాన్నే స్థాపించారు. జిల్లాకు చెందిన పలువురు సాహితీ యోధులు భాషా ప్రక్రియలైన నవల, నాటకం, కథ, కథానిక, గేయం, కవిత, పద్యం.. తదితర అంశాల్లో సిక్కోలు భాషకు సింగారాన్నిస్తూ, తెలుగుకు వెలుగునందిస్తున్నారు. జిల్లాకు చెందిన కవి భావశ్రీ ఆరు గ్రంథాలపై నాగార్జున విశ్వవిద్యాలయం వారు దూరవిద్యలో ఎంఫిల్‌ చేశారు.


భావశ్రీ

  • image : courtesy with Eenadu news paper.

'తెలుగు జాతి నాది. తెలుగు సంస్కృతి నాది. ఇతర భాషలెన్నినేర్చిన, తెలుగు విడువబోని తెలుగు కవిని'.. అంటూ తన మాతృభాష ప్రేమను చాటుకుంటున్న ప్రేమికుడు భావశ్రీ.. సాహిత్యమే తన జీవన వారధిగా మార్చుకుని.. తన శతాథిక గ్రంథాలతో అభిషేకం చేశారు. సాహితీ సేద్యంపై విశ్వవిద్యాలయాల స్థాయిలో పరిశోధన జరుగుతోందంటే ఆయన భాషా పదునును అంచనా వేయొచ్చు. శ్రీకాకుళానికి చెందిన ఈయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ సాహితీ సాంస్కృతిక శాఖ జిల్లా శాఖ అధ్యక్షుడిగా ఉన్నారు. జిల్లా సాంస్కృతిక కౌన్సిల్‌కు రెండుసార్లు సభ్యునిగా, మూడుసార్లు అధికార భాషా సంఘ సభ్యునిగా వ్యవహరించారు. 77 ఏళ్ల వయస్సు మీద పడినా.. భాష కోసం ఆయన తన అక్షర సేవను నిరాటంకంగా చేస్తూనే ఉన్నారు.

* పద్యం, గద్యం, నాటిక, నాటకం, సమీక్ష, సంగీత రూపకం, గజల్స్‌, గేయాలు, విమర్శలు, వ్యాఖ్యానాలు, ఏకపాత్రలు, పల్లెసుద్దులు, గిరిజన గీతాలు, అనువాదాలు, హరికథలు, బుర్రకథలు.. ఇలా అనేక సాహితీ ప్రక్రియలలో 120కు పైగా గ్రంథాలు రాసిన సాహితీయోధుడాయన.
* దూరదర్శన్‌ 'పద్యాలతోరణం'లో తన భాషా చతురతతో రాష్ట్రస్థాయి ప్రథమునిగా నిలిచారు.

* భావశ్రీ ఆరు గ్రంథాలపై నాగార్జున విశ్వవిద్యాలయం వారు దూరవిద్యలో ఎంఫిల్‌ చేశారు.
* నాలుగు మహాసహస్రావధానాలు, 200కు పైగా అష్టావధానాలులో పృచ్ఛకునిగా, సంధానకర్తగా, అధ్యక్షునిగా వ్యవహరించారు.

ప్రాచీన సాహిత్య పునాదులపై, సమకాలీన రచనల అవగాహనతో భవిష్యత్తుకు మార్గదర్శిగా, నేటియువత రచనలు చేసి సమాజ హితానికి దోహదపడాలన్నది భావశ్రీ అంతరంగ భావన. రచనలు వందల కొద్దీ పేజీల కన్నా సంక్షిప్తంగా అద్దంలో పర్వతాన్ని చూపేలా సూటిగా ఉంటూ పాఠకుల గుండెలను కదిలించేలా ఉండాలని సూచించారు.
------------------------------------------------

ఎం.సత్యనారాయణమూర్తి

  • image : courtesy with Eenadu news paper.

మన భాషా సౌందర్యాన్ని వివరించేందుకు నేటితరం కవులు సౌందర్య రసస్ఫోదకంగా రచనలు చేయాలంటున్న ఎం.సత్యనారాయణమూర్తి శతక రచనలో చేయితిరిగిన శిల్పి. పదేళ్లు జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో తెలుగు భాష అధ్యాపకునిగా, తెలుగు విభాగాధిపతిగా వ్యవహరించారు. ప్రస్తుతం విశ్రాంత జీవితంలో ఉన్న ఆయన భాషపై ఉన్న మక్కువ ఇప్పటికీ వీడలేదు. భాష మూలాలను స్పృశించే అంశాలలో తన ప్రసంగాలతో నేటి తరానికి ఆ మాధుర్యాన్ని పంచుతూనే ఆ దిశగా వారిని దిశానిర్దేశం చేస్తున్నారు.

* భవాని, సూర్య, శ్రీ దుర్గాంబ శతకాలు, హనుమత్‌ శతకం, శ్రీకూర్మనాథ నామ సుథ, శ్రీ సత్యసాయి స్తోత్రం ఆయన కలం జాలువారిన అక్షరమాలలు.
* ఆకాశవాణి కార్యక్రమంలో 'కాళిదాసో విలాసః' అనే అంశంపై,కలశేఖరుడు రాసిన 'ముకుందమాల' కావ్యంపై, భాసుని నాటకాలపైన ప్రసంగాలు చేశారు.
* విజయనగరంలో జరిగిన కౌముదీ పరిషత్‌ వజ్రోత్సవాల్లో 'అవధానంలో రామాయణ కథాంశాలు' అనే విషయమై ఆయన ప్రసంగం మన భాషలోని అవధాన మాధుర్యాన్ని తెలియజేసింది.
* శ్రీకాకుళం ఉపనిషన్మందిరంలో 'సాహిత్య చమత్కారాలు' అనే విషయమై మాట్లాడారు.
-----------------------------------------------

డాక్టర్‌ ఎం.వి.రమణారావు

  • image : courtesy with Eenadu news paper.

నేత్ర వైద్య నిపుణునిగా.. 50 ఏళ్ల పయనంఆయనను సాహితీ సేద్యం దిశగా చూసేలా చేసిందేమో! లేకుంటే ఏడుపదుల ముదిమి ప్రాయంలో భాషపై ప్రేమతో రచనా వ్యాసంగాన్ని ప్రారంభించి ప్రత్యేక రీతిలో అక్షరమాలికలు కుడుతున్న డాక్టర్‌ ఎం.వి.రమణారావు శ్రీకాకుళం వాసి. నేటి తరం పాశ్చాత్య ప్రభావంలో ఉన్నా.. అది శాశ్వతం కాదని దానిపై విసుగొచ్చి మళ్లీ భాషా మూలాల్లోకి వారు వెళ్తారని విశ్వసిస్తున్న ఈ అక్షర వైద్యుని గ్రంథాల శీర్షికలు ఎంతో హృద్యమైన భావాన్నిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సాహితీ పరంగానే కాకుండా వైద్య విద్యార్థులకు ఉపకరించేలా రూపొందించిన ఆంగ్లం-తెలుగు వైద్య నిఘంటువు హైదరాబాద్‌ పబ్లిషర్స్‌ వారు ప్రచురించారు.

* 'రమణీయం', 'కమనీయం', 'మహనీయం' అనే అంతరంగాన్ని హత్తుకునేలా ఉన్న పద్య మాలికలతో పాటు 'అనలానిలా' అనే గీత మాలికను రచించారు. అనలం అంటే అగ్ని అని, అనిలం అంటే వాయువుఅని ఆయన వివరించారు.
* 'ఉదయకిరణాలు', 'సంధ్యారాగం', 'వెన్నెల వెలుగులు' అన్నవ్యాస మాలికల శీర్షికలు రోజులోని కాలాన్ని సూచించేలా ఉన్నాయి.
* తన గ్రంథాల మాధుర్యాన్ని నేటితరానికి చేరేలా ఆయన కంప్యూటరులోనూ ఉంచారు. 'కమనీయం. బ్లాగ్‌స్పాట్‌. కాం' అనే బ్లాగ్‌లో చూడొచ్చు.
* డాక్టరు రచనలపై ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు పీహెచ్‌డీ చేస్తున్నారు.
---------------------------------------------------

డాక్టర్‌ పులఖండం శ్రీనివాసరావు

  • image : courtesy with Eenadu news paper.

మన భాషను బతికించుకునేందుకు చిరుప్రాయం నుంచే విద్యార్థుల్లో ఆ దిశగా దృక్పథాన్ని రగిలించాలి. ఆంగ్ల పద్యాల్లా తెలుగు పద్యాలనూ ప్రతినిత్యం చదివించాలి. అప్పుడే మన భాష వెలుగు లీనుతుందంటున్నారు డాక్టర్‌ పులఖండం శ్రీనివాసరావు. డిగ్రీ, పీజీ విద్యార్థులకు బోధనలో ఇప్పటికీ ఆయన తెలుగు పద్యాల విశిష్టతను వివరిస్తూనే ఉన్నారు. శ్రీకాకుళం గాయత్రి డిగ్రీ, పీజీ కళాశాలల ప్రిన్సిపల్‌గా ఉన్న ఈయన మాతృ భాష సేవలో పునీతమవుతున్నారు. ఆయన భాషా సేవ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారాన్ని తెచ్చిపెట్టింది.

* సిక్కోలు భాషా విశిష్టతను, సాహితీ విలువలను వివరిస్తూ ఆకాశవాణిలో ఆయన చేసిన ప్రసంగాలు పుస్తకంగా రూపుదిద్దుకుంది.
* మన సాహిత్యంలోని ముఖ్యాంశమైన 'హరికథ విలాసం' అనే పుస్తకాన్ని రాశారు. 'ఉత్తరాంధ్ర హరికథ వికాసం' అనే సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించి పీహెచ్‌డీ అందుకున్నారు.
*వివిధ సామాజికాంశాలపై ఆయన కవిత, పద్య రచనలు 'వసంతసంతసం'పేరుతో పుస్తక రూపం ధరించింది.
* 'భాస్కర రామాయణం' అనే గ్రంథం కూడా అచ్చయింది.
* తెలుగు భాషపై ఆయనకున్న మక్కువతో ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్య డిగ్రీ తెలుగు పుస్తకాల రచయితగా ఉంటున్నారు.
* ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన జిల్లాకు చెందిన కె.జె.రావుపై 'కె.జె.రావు ఓ స్ఫూర్తి.. ఓ దిక్సూచి' అనే పుస్తకాన్ని రాశారు.
* ఆంధ్ర విశ్వవిద్యాలయ సెనేట్‌ సభ్యునిగానూ, విజయనగరం ఎం.ఆర్‌.కళాశాల తెలుగు బోర్డు ఆఫ్‌ స్టడీస్‌ సభ్యునిగానూ, ఇంకా.. జిల్లా కేంద్రంలోని ఇంటాక్‌, సునాదవినోదిని, ఉపషన్మిందిరం, ఆంధ్ర పద్య కవితా సదస్సు మొదలగు సంస్థల్లో వివిధ హోదాల్లో ఉన్నారు.
* పులఖండం భాషా సేవలకు 2008లో ఉపాధ్యాయ దినోత్సవాన ముఖ్యమంత్రి నుంచి రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక పురస్కారాన్ని అందుకున్నారు. 2006లో హైదరాబాద్‌కు చెందిన హెల్త్‌కేర్‌ఇంటర్నేషనల్‌ సంస్థ వారు మదర్‌థెరీసా సేవాపురస్కారం, ఛత్తీస్‌గఢ్‌ తెలుగు సంఘం 'శ్రావణ సంధ్య' పురస్కారం, బరంపురం ఆంధ్ర భాషా సమాజం ఆధ్వర్యంలో ఉగాది పురస్కారం, శ్రీకాకుళం 'సిక్కోలు' పురస్కారం ఆయన సొంతమయ్యాయి.

  • =============================
Visit my website -> Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment