Wednesday, September 26, 2012

Majji Narayanarao-మజ్జి నారాయణరావు

  •  
  •  
నాలుగు దశాబ్దాలపాటు జిల్లా రాజకీయాల్లో తనదంటూ ముద్రవేసి, జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ అభివృద్ధికి కృషి చేసిన ప్రముఖుల్లో ఒకరైన మజ్జి నారాయణరావు జిల్లా కాంగ్రెస్‌లో చెరగని రాజకీయముద్రవే్సారు . వ్యూహప్రతివ్యూహాల్లో దిట్ట.
వ్యూహప్రతివ్యూహాలు, రాజకీయ ఎత్తులు వేయడంలో దిట్టగా పేరుగాంచిన నారాయణరావు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు గౌతు లచ్చన్నకు ప్రత్యర్థిగా రాజకీయాలు నడిపారు. కాంగ్రెస్‌ పార్టీలో ప్రముఖ నాయకునిగా వెలుగొంది పాత సోంపేట నియోజకవర్గంలో గౌతు కుటుంబానికి చిరకాల ప్రత్యర్ధిగా వ్యవహరించడమే కాకుండా జిల్లాలో కాంగ్రెస్‌కు జవజీవాలు అందించడంలో నారాయణరావు ప్రధానపాత్ర పోషించారు. కొంతకాలంగా అస్వస్థతతో ఇబ్బంది పడుతూ సొంత గ్రామమైన సోంపేట మండలం పాత్రపురం లోనే ఉంటున్న ఆయన
మంగళవారం 25/09/2012 అర్ధరాత్రి కన్నుమూశారు.  బుధవారం ఉదయం 8.45 గంటల ప్రాంతంలో సొంత గ్రామం పాత్రపురంలోనే ఆయన అంత్యక్రియలు జరిగాయి.నాయకులు అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు.


జులై 4, 1937లో జన్మించిన మజ్జి నారాయణరావు డిగ్రీ చదివిన తరువాత పెద్దన్నయ్య వద్ద ఉంటూ ఎయిర్‌ఫోర్సుతోపాటు ఇతర ప్రభుత్వరంగ సంస్థలలో ఉద్యోగాలు చేశారు. మూడో అన్నయ్య మజ్జి తులసీదాసు రాజకీయాల్లో రాణించడం, రాష్ట్ర కాంగ్రెస్‌ రాజకీయాల్లో బిజీ కావడంతో తన వారసునిగా సోంపేట నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహించేందుకు నారాయణరావుని  తీసుకొచ్చారు. 1962లో నారాయణరావు రాజకీయాలలో ప్రవేశించి రాజకీయ కురువృద్దుడు సర్దార్‌ గౌతు లచ్చన్నకు ప్రత్యర్థిగా వ్యూహాలు అమలు జరిపేవారు.

డిగ్రీతోపాటు ఎల్‌ఎల్‌బీ చదివిన ఆయన న్యాయవాదిగా సోంపేట కోర్టులో ప్రాక్టీసు చేస్తూనే రాజకీయాల్లో అన్న తులసీదాసుకు అండదండలందించేవారు. తులసీదాసు మందసలో నివాసం ఉండి ఆ ప్రాంత రాజకీయాలు పరిశీలిస్తే నారాయణరావు సోంపేటలో నివాసం ఉంటూ ఈ ప్రాంత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారు. స్వాతంత్య్రం వచ్చిన నుంచి గౌతు కుటుంబానికి కంచుకోటగా ఉన్న పాత సోంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ ఉనికిని కాపాడడంలో ఆయన పాత్ర ప్రధానమైనది. 1972లో అన్నను గెలిపించడంతోపాటు ఆ తరువాత జరిగిన  ఎన్నికల్లో లచ్చన్నకు కాంగ్రెస్‌ గట్టిపోటీ ఇచ్చే విధంగా నియోజకవర్గాన్ని  తీర్చిదిద్దారు. కొన్ని ప్రత్యేక కారణాల నేపథ్యంలో జనతాపార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేసి ఓడిపోయారు. ఏడాది మినహాయిస్తే మిగిలిన కాలమంతా కాంగ్రెస్‌ పార్టీలోనే నారాయణరావు కొనసాగారు. 1983లో తెదేపా ఆవిర్భావం తరువాత ఎన్టీఆర్‌ హవాలో ఉత్తరాంధ్ర మొత్తాన కాంగ్రెస్‌ పార్టీ పరాజయం పాలుకాగా ఒక్క సోంపేటలో మాత్రం నారాయణరావు గెలుపొంది రాష్ట్రంలో ప్రత్యేకత చాటుకున్నారు. 1983లో సోంపేటలో జరిగిన ముక్కోణ పోటీలో లోక్‌దల్‌ తరఫున పోటీచేసిన రాజకీయ కురువృద్ధుడు సర్దార్‌ గౌతు లచ్చన్నను ఓడించడం ద్వారా నారాయణరావు తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పటి ఎన్నికల్లో తెదేపా తరఫున బి.సత్యవతి పోటీచేశారు. ఆ తరువాత జరిగిన కుటుంబ వివాదాల నేపథ్యం, ఇతర అంశాల మూలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో పెద్దగా రాణించలేకపోయారు. 1989లో పోటీ చేసినప్పటికీ అంతర్గత కుమ్ములాట ఫలితంగా  ఆయన ఓటమిపాలయ్యారు. మామిడిపల్లి సర్పంచిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన నారాయణరావు మందస సమితి అధ్యక్షునిగా రెండుసార్లు, కోర్టులో కేసు వేసి గెలవడం ద్వారా మందస ఎంపీపీగా ఒకసారి  ఆయన పనిచేశారు. జిల్లా కేంద్రబ్యాంకు డైరెక్టర్‌గా, ఫిలిం సెన్సార్‌బోర్డు సభ్యునిగా, ఆర్టీసీ జోనల్‌ ఛైర్మన్‌గా సేవలందించారు. పీసీసీ, డీసీసీల్లో కూడా పలు పదవులు నిర్వహించడమే కాకుండా  దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డికి ప్రధాన అనుచరునిగా గుర్తింపు పొందారు. ఆయన ఆశించినస్థాయిలో రాజకీయ ప్రస్థానం 
కొనసాగలేదు. అయినప్పటికీ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీని బలంగా నిర్మించినవారిలో ఆయన పాత్ర ప్రధానమైందని చెప్పవచ్చు. 2004 తరువాత వై.ఎస్‌.ఆర్‌. అధికారం చేపట్టడంతో నారాయణరావు రాజకీయ ఎదుగుదల బాగుంటుందని అంతా   భావించినప్పటికీ 2009లో నియోజకవర్గ  పునర్వవస్థీకరణతో పరిస్థితి తిరగబడింది. ఆర్ధికంగా, ఇతర విధాలుగా కూడా ఆయన ఇబ్బందులు పడ్డారు. నారాయణరావు పెద్దన్నయ్య కుమార్తెల్లో ఒకరు ఆమదాలవలస ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి కాగా ఇంకొకరు కణితి లలితాదేవి మాజీ ఎంపీ కణితి విశ్వనాథం భార్య కావడం విశేషం. మరో అన్న తులసీదాసు కుమార్తె మాజీ ఎమ్మెల్సీ మజ్జి శారద రాజకీయాల్లో కొనసాగుతున్నారు. నారాయణరావుకు భార్య  పార్వతితోపాటు కుమార్తె సుధాబాల, కుమారుడు రాంబాబు ఉన్నారు.

  • ===================
Visit my website -> Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment