Monday, November 19, 2012

Mojjada Mohanarao-మొజ్జాడ మోహనరావు



  •    
  •  ఓ లక్ష్యం నిర్దేశించుకొని దాన్ని సాధించే వరకు పట్టుదలతో శ్రమించడం విజయానికి ఒక మార్గమయితే తనకు ఇష్టమైన రంగంలో అవకాశాలు రానప్పుడు అందివచ్చిన వాటిని సద్వినియోగం చేసుకొని ఆ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవడం మరో విధానం.. మార్గమేదయినా ఎంచుకొన్న విధానంలో స్పష్టత.. ఆచరణలో చిత్తశుద్ధి ఉంటే విజయాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయనేందుకు పట్టణానికి చెందిన మొజ్జాడ మోహనరావును నిదర్శనంగా చెప్పుకోవచ్చు. తనకిష్టమైన రంగంలో ఎదగడమే లక్ష్యంగా పొట్టచేతబట్టుకుని రాజధానిలో అడుగుపెట్టిన మోహనరావుకు మొదట్లో చేదు అనుభవాలే ఎదురయ్యాయి. అయినా నిరాశ చెందక వెనక్కు తిరిగిరాలేక ఒంటరిగానే జీవన పోరాటం సాగించాడు. ఆ దిశలో అనుకోకుండా అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని అల్లుకుపోయాడు. డబ్బింగ్‌(గాత్రదానం) కళాకారుడిగా స్థిరపడ్డాడు. క్షణం తీరికలేకుండా పనిచేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. తాజాగా టీవీ విభాగంలో రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డుకు సైతం ఎంపికై ఓ మైలురాయి దాటాడు.

శ్రీకాకుళంలోని బొందిలీపురం ప్రాంత వాసి రెవెన్యూశాఖలో మాజీ అధికారి మొజ్జాడ రామారావు, వరలక్ష్మిల నలుగురి సంతానంలో ఆఖరివాడు మోహనరావు. ఎం.ఎ., బి.పి.ఇడి చదువుకున్న అతను తొలిరోజుల్లో అల్లంశెట్టి చంద్రశేఖరరావు ప్రోద్భలంతో తన సాహిణి ధర్మారావు వద్ద గానంలో శిక్షణ పొందారు. ఆ తర్వాత వివిధ ఆర్కెస్ట్రాలలో వందలాది ప్రదర్శనలిచ్చారు. అదే క్రమంలో కాకుళం సిటీకేబుల్‌లో న్యూస్‌రీడర్‌గా అవకాశం రావడంతో దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆ రంగంలో మరింత ఎదగాలని మక్కువ పెంచుకున్నారు.

శ్రీకాకుళంలోనే ఉండిపోతే తన లక్ష్యసాధన వీలుకాదని అప్పటికి పోగేసిన మొత్తాన్ని చేత పట్టుకుని తన కలలను సాకారం చేసుకోవడానికి 2000లో రాజధానికి పయనమయ్యారు. అప్పటికే న్యూస్‌రీడింగ్‌ రంగంలో విపరీతమైన పోటీ నెలకొని ఉండడంతో అందులో అవకాశాలు క్ష్లిష్టంగా మారాయి. ఒట్టి చేతులతో వెనుక్కు వెళ్లలేక... ఇక్కడే ఉండలేక ఏం చేయాలో తేల్చుకోలేని సందిగ్ధ సమయంలో కలల రాజధాని కృష్ణానగర్‌ ఆయనకు ఆశ్రయచ్చింది. శ్రీకాకుళానికే చెందిన మరో డబ్బింగ్‌ కళాకారుడు భాస్కర్‌ మోహన్‌రావును హాస్య నటుడు మిఠాయి చిట్టికి పరిచయం చేసి ఒక అవకాశం ఇప్పించమని అభ్యర్థించారు. వాస్తవంగా డబ్బింగ్‌ చెప్పడం ఇష్టం లేకపోయినా తక్షణం పొట్ట నింపుకోవడానికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగారు. తొలిచిత్రం 'అప్పారావు నెల తప్పాడు' విడుదల కాకపోయినా డబ్బింగ్‌లో ప్రతిభ కనబర్చడంతో తరువాత ప్రేమకు స్వాగతం, స్టూడెంట్‌ నంబర్‌-1, నువ్వునేను తదితర సినిమాలలో వరుసగా అవకాశాలు వచ్చి పడ్డాయి. అక్కడ నుంచి ప్రారంభమైన మోహనరావు పయనం ఇక వెనుదిరిగి చూసుకునే అవసరమే లేకుండా చేసింది. అర్దరాత్రి, అపరాత్రి అన్న తేడా లేకుండా ఎప్పుడు పిలిచినా దర్శకులు, నిర్మాతలకు అందుబాటులో ఉండే అతను అతి తక్కువ కాలంలో అత్యంత బిజీ కళాకారుడిగా మారిపోయాడు.

గత దశాబ్దకాలంలో వచ్చిన చిత్రాలలో అత్యధిక సినిమాలకు ఆయన గాత్రదానం చేశారు. సహజంగా ఒక చిత్రంలో వచ్చే ఇరవై ముప్పై పాత్రలలో కనీసం మూడు, నాలుగింటికైనా ఆయనకు అవకాశం వచ్చేది. అలా ఒకటి కాదు...రెండు కాదు..పది కాదు...ఇరవై కాదు ఏకంగా 1500కుపైగా సినిమాల్లో వివిధ పాత్రలకు డబ్బింగ్‌ చెప్పడం చిన్న విషయం కాదనేది అందరూ అంగీకరించాల్సిన సత్యం. ఇటీవల విడుదలయిన షిరిడీసాయి, బిజినెస్‌మెన్‌, గబ్బర్‌సింగ్‌, మిస్టర్‌ఫర్‌ఫెక్ట్‌, రెబల్‌ లాంటి సినిమాల్లోని అనేక పాత్రలకు గాత్రదానం చేశారు.

టీవీ సీరియళ్లకు సైతం
ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్న ఆయన ప్రతిభ, పనితీరును గుర్తించిన నిర్మాతలు టీవీ సీరియళ్లలోనూ అవకాశమిచ్చారు. అలా ఇప్పటివరకు వందకు పైగా సీరియళ్లలోని వివిధ పాత్రలకు డబ్బింగ్‌ చెప్పారు. డిస్కవరీ(తెలుగు), టీవీ-5లో వచ్చే ధ్రువతారలు, టెలిబ్రాండ్స్‌తో పాటు వివిధ ఛానళ్లలో ప్రసారమవుతున్న మొగలిరేకులు, అగ్నిపూలు, మనుసు-మమత, చిన్నకోడలు, బంగారు కోడలు, ఇంద్రాణి, అభిషేకం, అపరంజి, కాంచనగంగ, అన్నాచెల్లెళ్లు, చంద్రముఖి, కుంకుమరేఖ, ముద్దుబిడ్డ, పుత్తడిబొమ్మ, గోరింటాకు, రాధాకళ్యాణం, పంచతంత్రం, మీరా, సిఐడి, చూపులు కలిసిన శుభవేళ తదితర సీరియళ్లలో ప్రస్తుతం ఎన్నో పాత్రలకు గాత్రదానం చేస్తున్నారు. ఉదయం ఇంటి నుంచి బయటపడితే స్టూడియోలు మారుతూ పనిపూర్తి చేసుకోవడానికి అర్దరాత్రి అయిపోతుందని మోహనరావు 'న్యూస్‌టుడే'కు చెప్పారు. ఆర్థికంగా కూడా ఈ రంగం ప్రోత్సాహకరంగా ఉండటంతో హాయిగా ముందుకు సాగుతున్నానన్నారు.

నంది avaarDu :
'మొగలిరేకులు' సీరియల్‌లో 'సెల్వ' పాత్రకు చెప్పిన డబ్బింగ్‌కు గానూ రాష్ట్రప్రభుత్వం కొద్దిరోజుల క్రితం నంది అవార్డును ప్రకటించింది. ఉగాది రోజున హైదరాబాద్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా నంది అవార్డును అందుకోనున్నారు. మరో విశేషమేమింటే ప్రస్తుతం అయిదోతరగతి చదువుతున్న కుమారుడు కార్తికేయను సైతం ఆయన డబ్బింగ్‌ రంగంలోనే ముందుకు తీసుకువెళుతున్నారు. భార్య పుణ్యవతి, సోదరులు ఉపేంద్ర, ప్రభాకర్‌, అక్క అనురాధ, బావ పాపారావుల ప్రోత్సాహం ఎప్పటికీ మర్చిపోలేనని ఆయన చెబుతుంటారు. మొత్తం మీద బతుకు తెరువు కోసం ప్రవేశించిన రంగమైనా చిత్తశుద్ధితో శ్రమించడం ద్వారా 'నంది' అవార్డు అందుకునే స్థాయికి చేరుకోగలిగారు.

చిక్కోలు వారికి ప్రోత్సహిస్తా
సినిమా, టెలివిజన్ల రంగాలు అంటే కేవలం బయటకు కనిపించే పాత్రలే అనుకోకూడదు. వెనుక పనిచేసే చాలామందిలో డబ్బింగ్‌ కళాకారులు ఒకరు. ఇటీవల కాలంలో టీవీ ఛానళ్లు, వాటిల్లో కార్యక్రమాలు విపరీతంగా పెరుగుతూ వస్తుండటంతో డబ్బింగ్‌ కళాకారులకు మంచి డిమాండ్‌ నెలకొంది. మనసుపెట్టి పనిచేస్తే తీరికలేనంత పని లభిస్తుంది. ఆర్థికంగా కూడా బాగుంటుంది. చిక్కోలు నుంచి ఆసక్తిగల కళాకారులు వస్తే నా సహాయ సహకారాలు అందించేందుకు ఎప్పుడు సిద్ధమే.

- మొజ్జాడ మోహనరావు, సినీ, టీవీ సీరియళ్ల డబ్బింగ్‌ ఆర్టిస్టు @Eenadu Srikakulam edition 20121120.

  • ===================
Visit my website -> Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment