Tuesday, December 21, 2010

సి.ఎస్.ఎన్. పట్నాయక్,C.S.N patnaik




శిల్ప, చిత్రలేఖనాల్లో సి.ఎస్.ఎన్. పట్నాయక్‌గారిది ప్రత్యేకమైన శైలి. కళాకారుడిగా ఆయన స్థానం అద్వితీయం. కళింగాంధ్ర జానపద సంస్కృతిని కంచు ప్రతిమల్లో ఆవిష్కరించి దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలు నిర్వహించారు. పురస్కారాలు పొందారు. ప్యాలెట్ నైఫ్‌తో రంగులద్ది త్రీడీ ఎఫెక్టు తీసుకొచ్చే చిత్రలేఖన సంప్రదాయాన్ని శిల్పరచనలోనూ చొప్పించి ఫలితాన్ని సాధించారాయన. కంచు శిల్పకారుడుగా విశిష్టత చాటుకున్న ఈ అచ్చమైన గాంధేయవాది ఆసక్తికరమైన అనుభవాలే ఈ వారం జ్ఞాపకాలు.

ప్రవృత్తికి భిన్నమైన వృత్తిలో ఏడేళ్లు నలిగిపోయాను. అదీ బాగా నేర్చుకోవలసిన వయసులో. కానీ కళాభిరుచిని గమనించే సహృదయులు ఎక్కడో ఉండకపోరు. కాకపోతే వాళ్లు మనకు తారసపడడమే మన జీవితంలో ముఖ్యమైన మలుపుకి కారణమవుతుంది. నా జీవితంలోనూ అంతే. గానుగెద్దులా మారిపోనున్న నా జీవితాన్ని అయ్యదేవర కామేశ్వరరావు పంతులు గారనే మహానుభావుడు కాపాడి నాలో ఉన్న కళాకారుడికి ప్రాణం పోశారు.
మా ఊరు శ్రీకాకుళం జిల్లా ఉర్లాం దగ్గర ఉన్న బాడాం. హైస్కూలు చదువంతా నరసన్న పేటలో సాగింది. సాగిందంటే సాగింది. ఎందుకంటే జాతీయ ఉద్యమం చాలా తీవ్రంగా సాగుతున్న దశ అది. ఆ ఉద్యమంలో పాల్గొనడం గొప్ప ఆనందంమే కాని చదువు అయితే సరిగ్గా సాగలేదు.

నరసన్న పేటలో మా డ్రాయింగ్ టీచర్ సాంబశివరావు నాకు ఆదిగురువు. ఆయన పౌరాణిక నాటకాలకు నేపథ్య తెరలు కూడా చిత్రించేవారు. ఆయన ఆ తెరల మీద చిత్రించిన రాజుల ఆస్థానాలు, అడవులు, అంతఃపురాలు అద్భుతంగా ఉండేవి. ఆయనతోనే ఎక్కువ సమయం గడిపేవాడిని. చదువుకి పనికిరానని మా నాన్న తొందరగానే గ్రహించి అంతే తొందరగా నన్ను కరణాన్ని చేశారు. చిక్కాలవలస గ్రామ కరణం బాధ్యతలు అప్పగించారు. అయిష్టంగానే ఏడు సంవత్సరాలు చేశాను. కాని చిత్రకళ పట్ల నా మక్కువ క్రమంగా పెరిగిందే తప్ప తగ్గలేదు. అప్పట్లో నార్త్ వైజాగ్ డిస్ట్రిక్‌లో శ్రీకాకుళం ఒక తాలూకా. జమాబందీ శ్రీకాకుళంలో జరిగేది - సుమారు పదిహేను రోజులు ఉండేది అది.

నేను రోజూ నాగావళి నది ఒడ్డున నాగేశ్వర ఫోటో స్టూడియో పక్కనుంచి ఆఫీసుకి వెళుతుండేవాడ్ని. అక్కడ కూర్మపు నరసింహంగారనే గొప్ప చిత్రకారుడుండేవారు. నేను రోజూ వస్తూ పోతూ చాలాసేపు అక్కడే గడిపేవాడిని. నా ఆసక్తి గమనించి ఆయన నేర్చుకుంటావా అని అడిగారు. నేర్చుకుంటానన్నాను. నాలోని కళాకారుడ్ని ఆయన గమనించారేమో! ఇక్కడుంటే ఇంతే, మద్రాసు పోయి ఫైన్ఆర్ట్స్‌లో చేరమన్నారు. కాని ఎలా సాధ్యం? మా నాన్న సాహసించలేకపోయారు. తాలూకా ఆఫీసులో నేను వేసిన గాంధీ చిత్రపటం పటం కట్టి ఉండేది. తహసీల్దార్ కామేశ్వర పంతులుగారు అది చూసి జమాబందీ కెళ్లినప్పుడు నన్నడిగారు. నాకు మద్రాసు వెళ్లాలనుందన్నాను. వారం తరువాత మా ఇంటికి కలెక్టర్ ఆఫీసునుండి సమన్లు వచ్చాయి. ఇంట్లో కంగారు. ఆందోళనతోనే బయలుదేరాం. ఆ సమన్లు చింపేసి 'అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంది. మద్రాసు పంపించండని మా నాన్నని ఒప్పించారు తహసీల్దారుగారు.

మా నాన్న ధాన్యం అమ్మి నాకు రెండు వందల రూపాయలిచ్చారు. వైజాగ్‌నుంచి మద్రాసు పన్నెండు రూపాయల చార్జి. 1950 మార్చిలో మద్రాసులో దిగాను. మద్రాస్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ మహామహులతో కళకళలాడుతుండేది. ప్రిన్సిపాల్ దేవీప్రసాద్‌రాయ్ చౌధురి. ఉపాధ్యాయులు రాంగోపాల్, ధన్‌పాల్ , ఫణిక్కర్ ... ఒకరిని మించిన వారొకరు. ఫ్రీ హ్యాండ్ ఔట్‌లైన్, మోడల్ డ్రాయింగ్ పరీక్ష పాసైనందువల్ల, ప్రవేశ పరీక్షలో సెకండ్ ర్యాంక్ రావడం వల్ల నేరుగా రెండో సంవత్సరంలోనే చేర్చుకున్నారు. అప్పటికే పెళ్లయ్యింది. భార్యని తీసుకుపోయాను కానీ ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డాను. ఆ సమయంలో నన్ను బాగా ఆదుకున్నవారు నార్ల వెంకటేశ్వరరావు, ఖాసా సుబ్బారావు, శివలెంక శంభుప్రసాద్, పి.వి. రాజమన్నార్ గార్లు. నా పెయింటింగ్స్‌ని కొని ఆ రకంగా నన్ను గట్టెక్కించారు. దేవీప్రసాద్‌గారు చేసిన గొప్పగొప్ప శిల్పాలు చూసే భాగ్యం కూడా కలిగింది. అవి చూసి ఎంతో నేర్చుకున్నాను.

చదువు పూర్తయ్యాక 1955లో తాడేపల్లిగూడెం దగ్గరి పెంటపాడులో పి.జి. ప్రాథమిక శిక్షణా కళాశాలలో ఉపాధ్యాయుడిగా చేరాను. జీతం నెలకు 155 రూపాయలు. హైస్కూలు టీచర్లు, హెడ్మాస్టర్లు, డి.ఇ.ఒలు మూడు నెలల పాటు శిక్షణ కొచ్చేవారు. అక్కడంతా గాంధేయ విధానం. ఎవరి పని వాళ్లే చేసుకోవాలి. రూరల్‌లైఫ్, డిగ్నిటి ఆఫ్ లేబర్ అనే అంశం మీద తరగతులు జరిగేవి. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి ఇక్కడి విద్యార్థే. రాట్నం తిప్పడం నూలు వడకడం చేసేవాడ్ని కొన్నాళ్లు. నా చెప్పులు నేనే కుట్టుకునే వాడ్ని. గాంధీ శతజయంతి సంవత్సరంలో చాలా చిత్రాలు వేశాను. నా జీవితంలో స్వర్ణయుగమంటే అక్కడ పని చేసిన ఏడు సంవత్సరాలే. పాఠ్య బోధనలో భాగంగా విద్యార్థులతో కలిసి గ్రామాలు సందర్శించడం, ప్రజల జీవన విధానం పరిశీలించడం, గ్రామాలు శుభ్రపరచడం... అక్కడి మనుషుల్ని, పరిసరాల్ని బొమ్మలుగా చిత్రించడం ... నిత్యనూతనంగా ఉండేది జీవితం. నా జీవిత విధానమే కాదు, నా వస్త్రధారణ కూడా అక్కడే మారింది. మా ప్రిన్సిపాల్‌గారు 'గాంధీయిజం గురించి మనం బోధిస్తున్నప్పుడు మన వస్త్రధారణగూడా అలాగే ఉండాలి' అని అన్నారు. ఇక అప్పటి నుండి ఖద్దరు పంచె, లాల్చీయే ధరిస్తూ వచ్చాను.

1962 నుండి 1983 వరకు అంటే పదవీ విరమణ చేసేవరకు గుంటూరు విమెన్స్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్ ఇన్ స్కల్ప్‌చర్ చేశాను. మొదట్లో నేను వేసినవన్నీ పెయింటింగ్సే. తరువాత కంచు శిల్పాలపై దృష్టి పెట్టాను. అప్పట్లో మన దేశంలో మూడు నాలుగు ప్రధాన నగరాల్లో తప్ప కంచు శిల్పాలు లేవు. 'ప్యాలెట్ నైఫ్‌తో పోర్ట్రెయిట్స్' నా స్పెషలైజేషన్. ఇందులో త్రీడైమెన్షన్స్ ఉంటాయి. ఇదే పద్ధతిలో ఫోర్ డైమెన్షన్స్ ప్రయత్నిస్తే ఎలా ఉంటుందనే ప్రయత్నమే కళాకారుడిగా నా ప్రత్యేకతని నిలబెట్టింది. అందుకు జానపద శైలి ఎంచుకున్నాను. కళింగాంధ్ర జీవనశైలిని ప్రపంచ వ్యాప్తం చేశాను.
ఈ కళ ఖరీదయినదైనా సొంత ఫౌండ్రీ ఉండేది నాకు. ఆర్డర్లు కూడా అదే స్థాయిలో వచ్చేవి కాబట్టి కొనసాగించగలిగాను. మా గురువులంతా చాలా గొప్పవారు. రాంగోపాల్, ధన్‌పాల్, ఫణిక్కర్... వాళ్లు చాలా నిజాయితీగా నేర్పబట్టే మేము చాలా నేర్చుకోగలిగాము. సొంత బిడ్డల్లా సాకే నిస్వార్థమైన గురువులు లభించడం కూడా నా అదృష్టమే.

ఒకసారి పర్యవేక్షణాధికారి మా కాలేజీకి వచ్చి 'మీ క్వాలిఫికేషన్ ఏమిటి?' అనడిగారు ప్రిన్సిపాల్‌ని. నాపేరే నా క్వాలిఫికేషన్ అన్నారు మా ప్రిన్సిపాల్. అదీ దేవీప్రసాద్ రాయ్ చౌధురి గొప్పతనం. ఆయన శిల్పాలు తయారు చేసేటప్పుడు చూపే ఏకాగ్రత, పనిముట్లు పట్టుకునే విధానం, మెరుగులు దిద్దే పద్ధతి నిద్రాహారాలు మాని గంటల తరబడి చూసేవాళ్లం. మొదట్లో సిగాయ్, వ్యానే, రూబెక్స్ రెమ్, బ్రాంట్‌లను అనుకరించాను. పెయింటింగ్‌లో మా గురువు కే.సి.యస్. ఫణిక్కర్ శైలికి ఆకర్షితుడినయ్యాను. కాని కళాకారుడుగా రాణించడానికి అవసరమైన విషయాలు నా జీవిత మూలాల్లోనే ఉన్నాయని గ్రహించాను. అందుకే కళింగాంధ్ర జానపదశైలిని ఎన్నుకున్నాను. నా చిత్రాలకు, శిల్పాలకు నమూనాలన్నీ నేను పుట్టి పెరిగిన ప్రాంతాల్లోని జానపదులే. శిక్షణలో భాగంగా క్రాఫ్ట్, వుడ్‌వర్క్, వీవింగ్ లెదర్ వర్క్ అన్నీ నేర్పించేవాళ్లం గాని, నేను మాత్రం కంచుతో పాటు టెర్రకోట వుడ్ మాధ్యమాలపై ప్రత్యేక శ్రద్ధ వహించేవాడిని.

దేశ విదేశాల్లో ఇప్పుడు నా శిల్పాలున్నాయి. అనేక చోట్ల ప్రదర్శనలు జరిగాయి. లలితకళా అకాడమీ అధ్యక్షునిగా, స్కల్ప్‌చర్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు సంయుక్త కార్యదర్శిగా పనిచేశాను. చాలా పురస్కారాలు పొందాను. మా ఆఖరి అబ్బాయి రవిశంకర్ ఒక్కడే ఈ రంగంలోకి వచ్చి ఉన్నత విద్యను అభ్యసించాడు. ప్రస్తుతం ఆంధ్రాయూనివర్సిటీ ఫైనార్ట్స్ విభాగానికి అధిపతిగా ఉన్నాడు. అతని భార్యా మంచి చిత్రకారిణే. మిగిలిన ముగ్గురబ్బాయిలూ మంచి స్థానాల్లో ఉన్నారు. నేను విద్యార్థిగా ఉన్నప్పటినుండీ నాకు చేదోడు వాదోడుగా ఉన్న నా భార్య శ్యామల సహకారం మరువలేనిది. ఇప్పుడు 86 సంవత్సరాలు నాకు. 1925 డిశంబర్ 6న పుట్టాను. ఈ యేడాదే గుంటూరు నుండి విశాఖపట్నానికి మకాం మార్చాను. ఎం.వి.పి. కాలనీలో పట్నాయక్ ఆర్ట్‌గ్యాలరీ ప్రారంభించాను. తమిళనాడులో దేశవాళీ కళా దేవాలయం ఒకటి ఉంది. అలాంటిది మన రాష్ట్రంలో కూడా ఉంటే బాగుంటుందని నా ఆశ. విశాఖలోని కాపులుప్పాడ దగ్గర ఆర్ట్స్ విలేజ్ పూర్తి కావాలని నా కోరిక. ఈ ఆశలు, కోరికలు ఎప్పటికైనా తీరుతాయో లేదో...!

By ..- జి.ఎస్. చలం -- Andhrajyoti sunday magazine20101219



  • =================================
Visit my website -> Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment