సాహితీ సేవకుడికి (యగళ్ల రామకృష్ణ) ప్రముఖుల నివాళి-భౌతికకాయాన్ని రిమ్స్‌కు అప్పగింత. తుదిశ్వాస వరకు తెలుగు సాహిత్యం, సంస్కృతి గురించే తపించిన కళా తపస్వి.. అభ్యుదయ వాదాన్ని జపించి నిజజీవితంలోనూ ఆచరించిన మానవతా వాది. ఉత్తరాంధ్ర భోజుడుగా బాపూరమణలు కీర్తించిన కళా పోషకుడు.. సాహితీ సేవకే జీవితాన్ని అంకితం చేసిన మహామనిషి యగళ్ల రామకృష్ణ ఇక లేదు. ఆయన యగళ్ల రామకృష్ణవార్త విని సాహితీ లోకం కన్నీరుపెట్టింది. బెంగళూరులో ఉన్న ఆయన భార్య డా. పద్మ, కుమార్తె లాలసలు ఆయన మరణవార్త విన్న వెంటనే బయలుదేరి గురువారం(25/10/2012) శ్రీకాకుళం చేరుకున్నారు. ఆయన కుమారుడు వేణు అమెరికాలో ఉంటున్నారు. ఆయన భౌతిక కాయానికి పలువురు ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు. మాజీ ఎం.పి. కణితి విశ్వనాథం, కథానిలయం వ్యవస్థాపకులు కారా మాస్టారు, విరసం చలసాని ప్రసాద్, దాసరి
రామచంద్రరావు, మునికోటి సత్యనారాయణ, బంధువులు, స్నేహితులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం రామకృష్ణ భౌతికకాయాన్ని రిమ్స్ ఆసుపత్రికి దానం చేశారు.
రిమ్స్‌లో 'యగళ్ల'కు శ్రద్ధాంజలి--కవి, కథకులు, సాహితీ విమర్శకులు దివంగత యగళ్ల రామకృష్ణ శ్రద్ధాంజలి కార్యక్రమం శుక్రవారం ఉదయం 9 గంటలకు రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో జరుగుతుందని, ఆయనతో అనుబంధం ఉన్న ప్రముఖుల సమావేశం నిర్ణయించింది. గురువారం న్యూకాలనీలో ప్రెస్ అకాడమీ పాలకవర్గ సభ్యులు నల్లి ధర్మారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాళీపట్నం రామారావు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.
ఉత్తరాంధ్ర భోజుడు రామకృష్ణ--సౌజన్యశీలిగా, ఉత్తరాంధ్ర భోజుడిగా యగళ్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు యగళ్ల రామకృష్ణ మృతి సాహితీ లోకానికి తీరని లోటు అని కథానిలయం వ్యవస్థాపకులు డా. కాళీపట్నం రామారావు మాస్టారు ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. కథానిలయం వ్యవస్థాపక సభ్యులు ముగ్గురులో ఆయనొకరని తెలిపారు. శ్రీకాకుళ సాహితీ సంస్థకు మొదట్నుంచి ఆర్థిక, హార్థిక సహాయం చేసిన రామకృష్ణ ఉత్తరాంధ్ర సాహితీ ఉన్నతికి తోడ్పడ్డారని శ్రీకాకుళ సాహితీ సంస్థ డా. బి.వి.ఎ.రామారావునాయుడు తెలిపారు. సాహితీవేత్త యగళ్ల రామకృష్ణ మృతి సాహితీలోకానికి తీరని లోటని కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు అన్నారు. గురువారం స్థానిక డిసీసీబీ కాలనీలోని యగళ్ల ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
యగళ్ల మృత దేహాన్ని వైద్యవిద్యార్థుల ప్రయోగాలకు వినియోగించుకునేందుకు వీలుగా శుక్రవారం (26 October 2012)ఉదయం అధికారికంగా యగళ్లకుటుంబ సభ్యులు వైద్యకళాశాలకు అప్పగిస్తారు. ఈ కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎం.పి. డాక్టర్ కిల్లి కృపారాణి తదితరులు పాల్గొంటారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. వారి సమక్షంలోఎంబాల్మింగ్ చేయబడిన పార్థివ శరీరాన్ని కుటుంబ సభ్యులు అందజేస్తారు.
--Courtesy with : శ్రీకాకుళం(సాంస్కృతిక), గుజరాతీపేట, న్యూస్‌టుడే
- ======================
No comments:
Post a Comment